నీకు నాకు మధ్యన
ఆశపడని రోజు ఒకటి ఎదురైనప్పుడు
మాట్లాడుకున్న మాటలన్నీ
కొత్త రంగులేసుకుని వచ్చి చేరతాయి
మాటలన్ని కుప్పగా పోసుకుని
నలుపురంగు నీదని ఎరుపురంగు నాదని
వేరుచేస్తూ పంచుకుందాం
గడిచిన కాలంలో
జంటగా కలసిన సమయపు పెట్టుబడి
ఎవరిదెంతో లెక్కతేల్చుకుందాం
చివరాఖరికి
అంతు తెలియని ఓ వలయంలో చిక్కుకొని
విషపుబాణపు మాటల తూటాలు
ఎన్నెన్ని ఎక్కడెక్కడ దాక్కున్నాయో
వెతికి వెతికి తీసుకువద్దాం
ఇక
అన్ని కుప్పగా పోసాక
పిసరు నాకు ఎక్కువే ఇవ్వు
అంత
మంచిదానను ఎట్లాగూ కానని
నిక్కముగా నాకు నమ్మకం కుదరనివ్వు...
ఓయ్
అలవాటైన మాటేగా
'సరే ' అని జత కలుపు
ఈసారికి ఇలాగే కానివ్వు...